top of page
Writer's pictureBalaji Gurram

మీ అబ్బాయికి చెప్పండి! దిశానిర్దేశం....


ఏ నదికైనా కట్టలు బలంగా ఉంటేనే...ప్రవాహ మార్గంలో వెళుతుంది.లేదంటే ఊర్లు, పొలాల మీద పడి నాశనానికి కారణమవుతుంది. మగపిల్లాడు సన్మార్గంలో పయనించాలంటే కరకట్టల్లా... తల్లిదండ్రులు నిలవాలి. మన అనుభవాన్నంతా ఆడపిల్లలకు పద్ధతులు నేర్పేందుకే వినియోగిస్తున్నాం. కానీ అబ్బాయి ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో చెబుతున్నామా..?


భారతీయ సమాజం పురుషాధిక్య భావజాలం ఉన్న సమాజం. మగాడు నేనేమైనా చేయగలను అనే ఆలోచనలో ఉంటాడు. ఈ ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలి. దీనికి కుటుంబంలో తల్లే కీలకపాత్ర పోషించాలి. అమ్మాయి బార్బీడాల్‌తో.. అబ్బాయి వేరే ఆటలే ఆడాలంటారు. మగ ఇలా ఉంటే.. ఆడ అలాగే ఉండాలని నిర్వచిస్తారు. ఈ సరిహద్దులను చెరిపేయాలి.


‘అమ్మాయిలా ఏడవొద్దు అందరిముందు చులకనైపోతావ్‌’ అని అబ్బాయితో చెబుతుంటారు తల్లిదండ్రులు. ఈ భావన అతడి భావోద్వేగాన్ని అణచివేయడమే. అది తీవ్రరూపం దాల్చితే దూకుడు, హింస రూపాల్లో ఒక్కసారిగా బయట పడుతుంది. కోపంగా, దూకుడుగా ఉన్నా తప్పులేదు.. సమాజంలో చలామణి అవుతుంది అనే అభిప్రాయానికి వస్తారు.


కోపం మగాడిది.. అణకువగా ఉండటం అమ్మాయి లక్షణం అని పదేపదే చెప్పొద్దు. ఈ మాటలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సున్నితత్వం ప్రదర్శించే మగ పిల్లల్ని కించపరచొద్దు. అమ్మాయిలా గాజులు తొడుక్కొని కూర్చో అనొద్దు. మగ పిల్లలు ఏడిస్తే ఓదార్చాలి, అందుకు కారణమేంటో కనుక్కోవాలి. ఏడుపు ఒక భావోద్వేగం. మనసుని తేలిక పరుస్తుంది. కోపం, బాధ తగ్గిస్తుంది.


అమ్మాయి, అబ్బాయిలకు పెంపకంలో తేడా చూపొద్దు. అమ్మాయి ఆరుగంటలకల్లా ఇంట్లో ఉండాలి అనుకుంటే అదే నియమం అబ్బాయికీ ఉండాలి. అమ్మాయి సిగరెట్‌ తాగితే లాగి చెంపమీద కొడతాం. అబ్బాయి చేసినా అదే శిక్ష పడాలి. అబ్బాయి స్నేహితులతో బయటికెళ్తున్నాడు అంటే అతడి ఎక్కడికి వెళ్తున్నాడు.. వాళ్లు ఎలాంటి స్నేహితులో ఓ కంట కనిపెట్టాలి. ప్రతి తల్లీ తన కొడుక్కి సమాజంలో ఉండే ఆడపిల్లల పట్ల మెలగాల్సిన పద్ధతిని నేర్పాలి. దురదృష్టవశాత్తు తన భర్తకు ఏవైనా చెడు అలవాట్లు ఉంటే మీ నాన్నలా చేయకూడదు.. అది తప్పు అని చెప్పగలగాలి.


అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం అంటే అదో నేరంలా భావించొద్దు. సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని బాబు చెబితే మంచీచెడులు, సాధ్యాసాధ్యాలు పరిశీలించి సావధానంగా వివరించాలి. తప్పు చేస్తున్నాడు వెంటనే శిక్షించాలి అనుకోకూడదు.


కౌమారం, యవ్వనంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఆకర్షణలు సహజం. దీన్నో నేరంగా చూడొద్దు. జీవితం, లైంగికాంశాలు.. అబ్బాయిలకీ విడమరిచి చెప్పాలి. విచ్చలవిడి సెక్స్‌తో కలిగే అనర్థాలు వివరించాలి. సమాజంలో ఒక జెంటిల్మన్‌లా గుర్తింపు రావాలంటే మన ప్రవర్తనా పద్ధతి ఎలా ఉండాలో విడమరిచి చెప్పాలి.


కొన్నిసార్లు మనం ఏమీ చెప్పకపోయినా మన ప్రవర్తన ద్వారా పిల్లలకు మార్గదర్శకంగా ఉండేలా నడుచుకోవచ్చు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండగలగడం పిల్లలకు చేసే అతిపెద్ద సాయం. వారి నడవడిక బాగుంటే, ఒకరి మధ్య ఒకరికి ప్రేమాప్యాయతలు ఉంటే పిల్లలు సమాజాన్ని ప్రేమించడం నేర్చుకుంటారు. సురక్షితమైన వాతావరణంలో పెరుగుతారు.

మగ పిల్లలు ఇలాగే ఉంటారనే నిర్లక్ష్యం వద్దు. ఏమాత్రం దారి తప్పాడని భావించినా, సావాసదోషం ఉందని పసిగట్టినా వెంటనే నియంత్రించాలి.

గొడవలు, తాగుడు, గృహహింస, అక్రమ సంబంధాలు.. ఇలాంటివి పిల్లలపై తప్పకుండా దుష్ప్రభావం చూపిస్తాయి. వాటిని మానేయాలి. సాధ్యమైనంత వరకు పిల్లలముందు ప్రదర్శించకూడదు.

5 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page